
Dr. V. Praveen Rao
Vice-Chancellor
PJTSAU వారి చేనుకబుర్లు కార్యక్రమం మొదలై సంవత్సరం పూర్తి అయింది. గత సంవత్సరం జనవరి 26 వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే.చంద్రశేఖర్ రావు గారు రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో అంటూ విద్యార్థులే రూపొందించి గానం చేసిన సిగ్నేచర్ ట్యూన్ ను ఆవిష్కరిస్తూ పతాక ఆవిష్కరణ సంచికను విడుదల చేశారు. తొలి సంచిక 28 వ తేదీ నుండి ప్రారంభమై ఈ సంవత్సరం జనవరి 20 వ తేది వరకు 52 ధారావాహిక సంచికలు ప్రతి బుధవారం మద్యాహ్నం 1:30 నిమిషాల నుండి 2:00 గంటల వరకు 30 నిమిషాల పాటు ఆకాశవాణి హైదరబాద్(ఎ) కేంద్రం ద్వారా ప్రసారమయ్యాయి. వ్యవసాయ శాస్త్రం, వ్యవసాయ ఇంజనీరింగ్, గృహవిజ్ఞాన విద్యార్థినీ విద్యార్థుల ప్రసార నైపుణ్యాన్ని పెంపొందించటానికి వినూత్నంగా, ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచింది. దాదాపు 100 అంశాలపై 70 మంది విద్యార్థినీ విద్యార్థులు నాటకం, కథ, కథానిక, క్విజ్ ల రూపంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు సమాజానికి అందించారు. తెలంగాణ రాష్టంలోని ప్రధాన పంటలు, వ్యవసాయ సమస్యలు, యాంత్రీకరణ అవసరాలు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమాచారం అందించవలసిన వివిధ ఆంశాలను ఎన్నుకొని శాస్త్రవేత్తలను సంప్రదించి వ్యవసాయ విద్యార్థులు స్క్రిప్ట్ లను తయారుచేసుకొని ప్రసారం చేశారు. అలాగే గృహవిజ్ఞాన విద్యార్థినీ విద్యార్థులు తల్లి గర్బంలో శిశువు రుపూదిద్దుకుంటున్నప్పటి నుండి వృద్దాప్యం వరకు వారి వారి జీవనశైలి రుగ్మతలను, ఆహార ఆరోగ్య మానసిక, శారీరక అవసరాలపై పలు సంచికలను ప్రసారం చేశారు. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వ్యవసాయ అభివృద్ది, గ్రామాభివృద్ది పట్ల స్పందనను అంకిత భావాన్ని కలిగించడం ప్రధాన ద్యేయంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది.
ఆశించినట్లుగా పంటసాగు, ఇంటిబాగు కోసం తమలో తృష్టను విద్యార్థులు బయలుపరుచుకున్నారు. ఆధునిక సమాచారాన్ని సేకరించటం, సూటిగా స్పష్టమైన పదాలను ముఖ్యంగా తెలంగాణ మాండలికాన్ని అనుసరించడం, వినోదాత్మకంగా విద్యను అందించే ప్రయోగాలు చేయడం అందుకు ఒక తార్కాణం. ఎంతో బాధ్యతాయుతంగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, పరస్పరం ప్రొత్సహించుకుంటున్నారు అందుకు వారందరిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆదరిస్తున్న శ్రోతలకు కూడా కృతజ్ఞతలు. మరొక సంవత్సరం పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. శ్రోతలు చురుకుగా పాల్గొనడానికి వీలుగా కొన్ని క్విజ్ కార్యక్రమాలు, వారి కోరికల మేరకు అవసరమైన సమచారాన్ని అందించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. విజ్ఞానాన్ని సంపాదించడం ఎంత ముఖ్యమో, దానిని అవసరమైన వారికి అందించడం అంతే ముఖ్యమనేది మా విశ్వవిద్యాలయం ముఖ్య సూత్రం. ప్రసంగాలు విని పరిశోధన చేసి రూపొందించే సాంకేతిక పరిజ్ఞానం సార్థకత అది గ్రామాలకు చేరినప్పుడే. మారుమూల పల్లెలలో సైతం అందుబాటలో ఉండే మాధ్యం రేడియో. దానిని వినియోగించుకొని కొన్ని లక్షల మందికి సమాచారం అందించడంలో మా విద్యార్థులు భాగస్వామ్యం అవ్వడం నాకు చాలా తృప్తినిస్తుంది. మా విశ్వవిద్యాలయంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం, విద్యార్థులను దాంట్లో భాగస్వామ్యం చేయడం, మరియు శాస్త్రజ్ఞులు, ఇతర బోధనా సిబ్బంది ఇందులో వారికి తోడ్పడడం ఎంతో ముఖ్యమైన కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎన్నో కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను.

